
గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు
ఆర్మూర్: రేయింబవళ్లు కష్టపడి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్‌లోని మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేశ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతల ఆత్మీయ కలయిక (కిసాన్ మిలాప్) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తే ఆనందం కలుగుతుందన్నారు. అంతకుముందు పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ మాట్లాడారు. ఈసారి వర్షాలతో రైతులు పండించిన పంట కొంతమేర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చేసిన ఆందోళనల సందర్భాలను వారు గుర్తు చేశారు. అన్వేశ్ రెడ్డి మాట్లాడుతూ దసరా వేడుకలు, అన్నదాతల ఆత్మీయ కలయిక పార్టీలకతీతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల సమయంలోనే పార్టీలని, ఆ తర్వాత అందరం ఒక్కటే అని చాటి చెప్పాలన్నారు. రైతాంగ సమస్యలతోపాటు తెలంగాణ ఉద్యమం, కుటుంబ పరిస్థితులపై ఆర్కెస్ట్రా బృందం పాడిన పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు దేవారం, సత్యనారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు జక్క లింగారెడ్డి, మంథని గంగారాం, ఐసీడీఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మంథని శ్రీనివాస్ రెడ్డి, నందిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్, మాజీ ఎంపీపీ దేవిదాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి,
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి
‘కిసాన్ మిలాప్’లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
పార్టీలకతీతంగా అన్నదాతల సమ్మేళనం
పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్, టీడీపీ నాయకులు

గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు

గిట్టుబాటు ధరతోనే రైతులకు మేలు