
భవానీ స్వాముల సేవలో అర్బన్ ఎమ్మెల్యే
సుభాష్‌నగర్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో సోమవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన భవానీ స్వాముల మహా అన్న ప్రసాదం, పూజా కార్యక్రమాలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి, మాతా ఆశీర్వాదంతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం భవాని స్వాములకు ఎమ్మెల్యే స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనానీ, కార్యదర్శి మారుతీ మల్లేష్, నాయకులు మాస్టర్ శంకర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మండలాల అధ్యక్షులు, భవానీ స్వాములు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.