
డైట్ బిల్లులు వచ్చేదెప్పుడో?
వెంటనే విడుదల చేయాలి..
● జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు
కొన్ని నెలలుగా నిలిచిన నిధులు
● ఇబ్బందుల్లో విద్యార్థులు, వార్డెన్లు
ఆర్మూర్‌టౌన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు కొన్ని నెలలుగా డైట్ బిల్లులు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వాపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరఫరా నిలిచే ప్రమాదం...
హాస్టల్స్‌కు రైస్, పప్పులు, చింతపండు, గుడ్లు, చికెన్, కూరగాయలు, వంటగ్యాస్ సరఫరా జరుగుతున్నప్పటికీ బకాయిలు ఎక్కువ కావడంతో సరఫరాదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే, విద్యార్థులకు ఆహార పదార్థల సరఫరా నిలిచే ప్రమాదం ఉంది. సరఫరాదారులు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పలుచోట్ల హాస్టల్ వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సమస్యలు రాకుండ చూస్తున్నారు. అలాగే హాస్టల్స్‌లో వందలాది కుక్‌లు, కాంటీన్ సిబ్బంది, వాచ్‌మెన్‌లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలు అందడం లేదు. దీంతో వారు జీతాలు లేకి కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తుండగా, ఇంటి యజమానులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలువురు కోరుతున్నారు.
బిల్లులు రాకపోవడంతో వసతి గృహం నిర్వహణ కష్టంగా మారింది. హాస్టల్ భవనం అద్దె, పిల్లకు కాస్మెటిక్ చార్జీలు కొన్ని నెలలుగా రావడం లేదు. నిధులు లేక జిల్లాలోని వసతి గృహాల అధికారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – సౌడ సురేష్, హాస్టల్ వెల్ఫేర్
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు