
వారం రోజులు.. రెండు భారీ చోరీలు
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
● ఇటీవల నగరంలోని ఓ ఇంట్లో 19తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీ అపహరణ
● తాజాగా అర్చకుడి ఇంట్లో..
ఖలీల్‌వాడి: నగరలో శివారు కాలనీలోని తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. గత వారం రోజుల్లో దుండగులు నగరంలో రెండు భారీ చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల నగరంలోని ఐదో టౌన్ పరిధిలోగల ఆసద్‌బాబానగర్‌లో తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 19 తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీని చోరీ చేశారు. ఈ ఘటన మరువకముందే తాజాగా మంగళవారం నాగారంలోని బ్రహ్మణకాలనీలో ఓ అర్చకుడి ఇంట్లోని 30 తులాల బంగారంను చోరీ చేశారు. వారం రోజుల్లో రెండు భారీ చోరీలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
దసరా సెలవుల నేపథ్యంలో..
దసరా సెలువులు రావడంతో కుటుంబసభ్యులు ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో కలిసి బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. ఈక్రమంలో దుండగులు తాళం ఉన్న ఇళ్లను గుర్తించి, తమకు అనుమైన సమయంలో, జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లినట్లయితే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండ, సేఫ్టీ ప్రదేశాల్లో, బ్యాంకు లాకర్లలో ఉంచాలని పేర్కొంటున్నారు.
కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఇంట్లో బంగారం, నగదు ఉంచవద్దు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి.
– బూస శ్రీనివాస్, నార్త్ సీఐ, నిజామాబాద్