
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండల పరిధిలోని వజ్జపల్లి గ్రామానికి చెందిన లింగాల సాయికుమార్, దూస్‌గాం శ్రీకాంత్ మంగళవారం బైక్‌పై కామారెడ్డి నుంచి వజ్జపల్లి బయలుదేరారు. మండల కేంద్రం సమీపంలో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎల్లారెడ్డి: పట్టణానికి చెందిన ఓ యువకుడు తప్పిపోగా, మండలంలోని ఓ వ్యక్తి అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలోని బీసీ కాలనీకి చెందిన హమీద్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. కానీ అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు అతడి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈక్రమంలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రామాగౌడ్ హైదరాబాద్‌కు వెళ్లగా బొల్లారం రైల్వేస్టేషన్ దగ్గర అతడికి హమీద్ కనిపించాడు. వెంటనే అతడు హమీద్‌ని కలిసి కుటుంబసభ్యులకు సమచారం అందించారు. అనంతరం హమీద్‌ను అతడి బంధువులకు అప్పగించారు. దీంతో రామాగౌడ్‌ను స్థానికులు అభినందించారు.
జక్రాన్‌పల్లి: మండలంలోని తొర్లికొండ గ్రామంలో చోరీకి పాల్పడ్డ నిందితుడికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. వివరాలు ఇలా.. తొర్లికొండ గ్రామంలోని గడ్డం భూమేశ్వర్ ఇంట్లో మార్చి 27న చోరీ జరిగింది. దుండగుడు ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోని డబ్బులు, వంట సామగ్రిని ఎత్తుకెల్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా అదే గ్రామానికి చెందిన నూనె కిరణ్‌ను గుర్తించారు. దీంతో అతడిని పట్టుకొని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించిట్లు ఎస్సై తెలిపారు.