
అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
● నగరంలోని పలు డివిజన్లలో పర్యటన
సుభాష్‌నగర్: నిజామాబాద్ కార్పొరేషన్‌లోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాల హనుమాన్ మందిరం పక్కన కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతానని కాలనీవాసులకు హామీనిచ్చారు. డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రెయినేజీ పూడికలు తీయాలని, అవసరమున్నచోట డ్రెయినేజీ పునర్నిర్మాణం చేపట్టాలని కమిషనర్‌కు సూచించారు. నగరంలో వీధి దీపాల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు. నగరంలో అభివృద్ధి పనుల కోసం స్పెషల్ ఫండ్ రూ.100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. నగరంలో రాత్రి సమయంలో ఆకతాయిలు మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కాలనీవాసులు విన్నవించగా, ఏసీపీతో మాట్లాడి రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేష్, బొబ్బిలి వేణు, ఎర్రన్న, పవన్, ఆనంద్, కాలనీవాసులు, తదితరులు ఉన్నారు.