
మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ సిటీ: రైస్‌మిల్లుల్లో పనిచేస్తూ మృత్యువాత పడ్డవారిని, క్షతగాత్రులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వడంతోపాటు రైస్‌మిల్ యాజమాన్యంపై చర్యలుతీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం పురాతన రైస్‌మిల్ గోడకూలి పక్కనగల ఇంటిపై పడడంతో ఆ ఇంటిలో నిద్రిస్తున్న ముగ్గురిలో మహేష్, అతని కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య మహేశ్వరి గాయాలతో బయటపడింది. పాత గోడను తొలగించడంపై నిర్లక్ష్యం చేసిన రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని మహేశ్వరికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఇందిరమ్మఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సాయమ్మ, భూలక్ష్మి, కౌసల్య, లింగవ్వ,పుష్ప, కిష్టయ్య,సిర్పూర్ సాయిలు,శంకర్ పాల్గొన్నారు.