
మక్క రైతుకు మద్దతేదీ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొక్కజొన్న పంట కోతలు మొదలై పక్షం రోజులు దాటినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇది అదునుగా మక్క రైతులను దళారులు దోపిడీ చేస్తున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. అయితే దళారులు రైతులకు క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.1,900 మాత్రమే ధర చెల్లిస్తున్నారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
జిల్లాలో 52,093 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది భారీ వర్షాలతో జిల్లాలో 1,100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నాశనమైంది. ఇది అధికారుల ప్రాథమిక అంచనా మాత్రమే. అనధికారికంగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మంగళవారం జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికీ వర్షాలు ఆగకపోతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దిక్కుతోచడంలేదని రైతులు చెబుతున్నారు. కాగా ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
● కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డిని సంప్రదించగా ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాసినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే భూపతిరెడ్డి ద్వారా ప్రయత్నాలు
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్న పంటను కొ నుగోలు చేసేందుకు నిజా మాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ భూపతిరెడ్డి ద్వారా తగిన ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎమ్మెల్యే ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించారు.
– మునిపల్లి సాయిరెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్
ఆందోళనలు చేస్తాం
మార్క్‌ఫెడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతులను వ్యాపారులు, దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికే వర్షాలతో నష్టపోయిన రైతులపైన కనికరం చూపాలి. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం. – పాట్కూరి తిరుపతిరెడ్డి,
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు
పంట కోత మొదలై పక్షం రోజులైనా ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు
రైతులను దోపిడీ చేస్తున్న దళారులు
మద్దతు ధర క్వింటాలు రూ.2,400
ఉండగా.. రూ.1,900 లోపే చెల్లింపు

మక్క రైతుకు మద్దతేదీ?

మక్క రైతుకు మద్దతేదీ?