
ఉత్సవం ఉత్సాహంగా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉన్న వివిధ వర్గాల ప్రజలతోపాటు దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన వారు నివసిస్తున్నారు. దీంతో ఉత్సవం ఏదైనా ఉత్సాహంగా, ఘనంగా నిర్వహిస్తున్నారు. భవసార్ క్షత్రియ సమాజ్, సింధీ, మార్వాడీ సమాజ్‌ల ఆధ్వర్యంలో చేసే పండుగలకు ప్రాధాన్యం ఉంటోంది. దీంతో దుర్గా నవరాత్రులు, గణపతి ఉత్సవాలు, శ్రీరామనవమి, శివరాత్రి, హోళీ ఉత్సవాలను కలసికట్టుగా చేసుకుంటున్నారు. ఇక ఇందూరుకే ప్రత్యేకమైన ఊర పండుగ, వీరహనుమాన్ విజయయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే రాష్ట్రంలో సంప్రదాయ ఉత్సవమైన బతుకమ్మ ఉత్సవాల విషయంలో మాత్రం జిల్లాలో రానురాను మరింత కళ వస్తోంది. మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కమిటీలు వేసుకుంటున్నారు.
రెడ్డి రీఫామ్ ఆధ్వర్యంలో బతుకమ్మ
నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో రెడ్డి రీఫామ్ మహిళల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టాయి. మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మకు వచ్చిన ఆలోచనతో రెడ్డి రీఫామ్ సొసైటీ ఏర్పాటు చేశారు. రెడ్డి కులస్తులు ఆడంబరంగా నిర్వహిస్తున్న శుభకార్యాలు, వివాహాలకు భారీ ఖర్చు చేస్తున్నారని, ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ప్లాస్టిక్ నిషేధంలో తమవంతు పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. వంటలు సైతం ఎక్కువగా చేసి ఆహారాన్ని వృథా చేయొద్దనే నినాదాన్ని వినిపించేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఆస్తులు అమ్ముకునే స్థాయిలో వేడుకలు చేయొద్దని ప్రచారం చేస్తున్నారు. ‘సింపుల్ వెడ్డింగ్, సింపుల్ లివింగ్, సింపుల్ ఈటింగ్, విమెన్ వెల్ఫేర్, స్టూడెంట్ వెల్ఫేర్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. బతుకమ్మ వేడుకల్లో లక్ష్మీకాంతమ్మ, ఇందిరారెడ్డి, సరళ మహేందర్‌రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి, నల్ల స్రవంతిరెడ్డి, విశాలిని రెడ్డి, సృజనరెడ్డి, సౌజన్యరెడ్డి, సంగీతరెడ్డి, స్వరూపారెడ్డి, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి సంప్రదాయల వైభవాన్ని
చాటుతూ సంబురాలు
బతుకమ్మ, దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి..
పండగ ఏదైనా పెరుగుతున్న ప్రాధాన్యం
ఇందూరుకు ప్రత్యేకం వీరహనుమాన్
విజయయాత్ర, ఊర పండుగ

ఉత్సవం ఉత్సాహంగా..