
సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించాలి
● వైభవంగా బతుకమ్మ సంబురాలు
● అన్ని శాఖలు భాగస్వాములు కావాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సంస్కతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబురాలను జిల్లాలో వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీ కృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమ వారం ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ బతుకమ్మ వేడుకల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేపథ్యంలో జిల్లాలో వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేయాలని, ముఖ్య కూడళ్లు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో హోర్డింగ్స్, బతుకమ్మ నమూనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలతోపాటు నిమజ్జనం చేసే నీటి వనరుల వద్ద లైటింగ్, సౌండ్ సిస్టమ్ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 26వ తేదీన ఎడపల్లి మండలం అలీసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, బాలికలతోపాటు మహిళా ఉద్యోగులు పాల్గొనేలా చూడాలని, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ఉత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని, ప్రతి రోజూ ఒక శాఖ తరఫున బతుకమ్మ పండుగను నిర్వహించాలన్నారు. 30వ తేదీన సద్దుల బతుకమ్మను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎంహెచ్‌వో రాజశ్రీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.