
వరిలో తెగుళ్లు.. నివారణ చర్యలు
రుద్రూర్: జిల్లాలోని వివిధ మండలాల్లో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పర్యటించి వరి పంటకు బాక్టీరియా ఎండాకు తెగులు, కాండం తొలుచు పురుగు ఉధృతి ఉన్నట్టుగా గుర్తించారు. ఈ సందర్భంగా తెగుళ్లు ఆశించడానికి కారణాలు, యాజమాన్య చర్యలను వ్యవసాయ పరిశోధన కేంద్రం అధిపతి, శాస్త్రవేత్త సమతా పరమేశ్వరి వివరించారు.
కారణాలు:
●జిల్లాలో సాగు చేస్తున్న వరి రకాలు తెగులు తట్టుకోలేకపోవడం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురవడం వల్ల ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంది.
●బ్యాక్టీరియా ఎండాకు తెగులు దుబ్బు చేసే దశ నుంచి చిరు పొట్ట దశలో ఉన్న వరి పంటను ఆశించే అవకాశం ఉంది.
●ఈ తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద అంచుల వెంబడి అలల మాదిరిగా నీటి రంగు డాగు మచ్చలు ఏర్పడతాయి. ఆకుల అంచుల వెంబడి కొన నుంచి కింది భాగం వరకు వ్యాప్తి చెంది ఆకులు ఎండి పోతాయి.
●దుబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశలో ఈ ఆకులు ఎండిపోవడం వల్ల దిగుబడిపైన ప్రభావం చూపుతుంది.
●ఈ తెగులు ఆశించిన మొక్కలను గమనిస్తే వాటి ఆకుల వెంబడి బ్యాక్టీరియాకు సంబంధించిన జిగురు ఉండలు ఉదయం వేళలో కనిపిస్తాయి. ఇది ఒక మొక్క నుంచి మరొక మొక్కకి లేదా ఇంకొక పొలంలోకి నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
●పంట నీటి ముంపునకు గురయినపుడు ఎండాకు తెగులు ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ తెగులు చూడడానికి పోషక లోపంలాగా కనిపిస్తునందున రైతులు గుర్తించడానికి ఇబ్బంది పడుతారు.
యాజమాన్య చర్యలు..
●తొలిదశలో గుర్తిస్తే తెగులు నివారించడానికి రాగి దాతు శీలింద్ర నాశనం అయిన కాపర్ హైడ్రాకై ్సడ్ మందును ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు వాడాలి. లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములుతోపాటుగా స్ట్రీప్టో మైసిన్ సల్ఫేట్ లేదా ప్లాంటో మైసిన్ అనే బ్యాక్టీరియా శిలీంద్ర నాశిని 0.4 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.
●వరి పంట పూత దశలో ఉన్నప్పుడు బ్యాక్టీరియా తెగులు లక్షణాలు గమనిస్తే ఈ రాగిదాతు శిలీంద్ర నాశనులను పిచికారీ చేయవద్దు. చిరు పుట్ట దశలో ఈ తెగులు తట్టుకునే శక్తిని పెంపొందించడానికి మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎకరానికి 15 నుంచి 20 కేజీలు వేసుకుంటే బ్యాక్టీరియా లక్షణాలు తట్టుకునే శక్తిని కూడా మొక్క గ్రహిస్తుంది.
●కాండం తొలుచు పురుగు ఉధృతి నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్‌పి 2 గ్రాములు వాడాలి. లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 18.5 ఎస్.సి 0.3 మి. లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
●రైతులు సరైన సమయంలో చీడపీడలను గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు.

వరిలో తెగుళ్లు.. నివారణ చర్యలు