
మరో ఐదేళ్లు అధికారంలో మేమే..
● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
వర్ని: ప్రస్తుత పదవీకాలంతోపాటు రాబోయే మరో ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నామని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ దోపిడీ రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడారని, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అన్నివర్గాల వారికి సమన్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇదే స్ఫూర్తితో మరో ఐదేళ్లపాటు పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.