
నిజాంసాగర్‌లోకి రికార్డు స్థాయి వరదలు
మూడు వారాల్లోనే..
● ఈ సీజన్‌లో 125 టీఎంసీల ఇన్‌ఫ్లో
● 111.53 టీఎంసీల అవుట్‌ఫ్లో
● కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే 125 టీఎంసీల ఇన్‌ఫ్లో రావడం గమనార్హం. ఇంకా వర్షాకాలం మిగిలి ఉన్నందున ఇన్‌ఫ్లో రికార్డు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి.
1920 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగు నీరు లేక పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అప్పటి పాలకులు భారీ సాగు నీటి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ఏడాది పాటు సర్వే చేసి అచ్చంపేట– బంజపల్లి గ్రామాల మధ్య గోదావరి ఉపనదిపై సాగునీటి ప్రాజెక్టుకు అనువైన స్థలం ఉందని గుర్తించారు. 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 1923 సంవత్సరంలో చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. డిప్యూటి చీఫ్ ఇంజినీర్ సీసీ పాలె, అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్‌జే తారాపూర్‌ల పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు సాగాయి. 1931 సంవత్సరంలో నిర్మాణం పూర్తయ్యింది. నిజాంసాగర్ ప్రాజెక్టును ‘ఎన్’ ఆకారంలో 1,405.05 అడుగుల నీటిమట్టం, 30 టీఎంసీల నీరు నిలువ ఉండేలా నిర్మించారు.
ఇది రెండోసారి..
నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే రెండోసారి. గతంలో 1998 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు 167 టీఎంసీ ఇన్‌ప్లోగా వచ్చింది. అప్పట్లో నిజాంసాగర్ వరద గేట్లతో పాటు ప్రధాన కాలువ ద్వారా 157 టీఎంసీల నీటిని మంజీర నదిలోకి వదిలారు. 1998 తర్వాత ఈ ఏడాది మళ్లీ భారీ వరదలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ప్రాజెక్టులోకి 125 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఎగువన ఉన్న పాత మెదక్ జిల్లాలో వానలు దంచికొట్టడంతో రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. గత నెల 28 న ఒకరోజులో గరిష్టంగా 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. అంతే స్థాయిలో 27 వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఇది ప్రాజెక్టు చరిత్రలో రికార్డుగా నిలిచింది.
గత నెల 18 నుంచి నిజాంసాగర్ ప్రా జెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. గతనెల 25న ఒక్క రోజు మాత్రమే వరద గేట్లను మూసివేశారు. ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఈ మూడు వారాల్లోనే 111.53 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా మంజీర నదిలోకి వదిలారు. ఎగువ ఉన్న సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టడంతోపాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 23,220 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ప్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు 3 వరద గేట్ల ద్వారా 17,865 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు.

నిజాంసాగర్‌లోకి రికార్డు స్థాయి వరదలు