
గుర్తుతెలియని వ్యక్తి హత్య
ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ కిరాణా దుకాణం ముందర ఒక గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. సదరు కిరాణ దుకాణం వద్ద మృతదేహం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అతడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మృతుడి మెడకు బట్ట, సుతిలితో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు కనపడుతోందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ ఫుల్ షర్ట్, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, అతని వద్ద ముస్లింలు ధరించే టోపీ ఉందన్నారు. ఘటనపై భగవాన్‌కాలనీకి చెందిన వెనిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి సమాచారం తెలిస్తే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712659714కు సమాచారం అందించాలన్నారు.