
సర్వం సిద్ధం..
నేడు వినాయక నిమజ్జనం
ఖలీల్‌వాడి/నిజామాబాద్ రూరల్ : లంబోదరుడి నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధమైంది. విశేష పూజలందుకున్న వినాయకుడు శనివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. నిజామాబాద్ నగరంలో సార్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. 11 జతల ఎడ్లతో రథం కదులుతుంది. దుబ్బా నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూపార్క్, గాజుల్‌పేట్, పెద్దబజార్, గోల్‌హన్మాన్, పులాంగ్ మీదుగా వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావి వద్దకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్లు విగ్రహాలకు తగలకుండా సరిచేశారు.
పటిష్ట బందోబస్తు
వినాయక నిమజ్జనం సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందితోపాటు ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, హోంగార్డులు సుమారు 1300 మంది బందోబస్తులో పాల్గొననున్నారు. శోభాయాత్రలో ట్రాఫిక్ నియంత్రణకు ఎకై ్సజ్, ఫారెస్ట్ సిబ్బందితోపాటు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవలందించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బాసర, ఉమ్మెడ బ్రిడ్జి ప్రాంతాలను శుక్రవారం రాత్రి సీపీ సాయిచైతన్య పరిశీలించారు.
ట్రాఫిక్ డైవర్షన్
వినాయక నిమజ్జనం రోజు నిజామాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను డైవర్షన్ చేస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ తెలిపారు. బోధన్ నుంచి వచ్చే బస్సులు అర్సపల్లి రైల్వేగేట్ నుంచి, కలెక్టర్ ఆఫీస్, కంఠేశ్వర్ బైపాస్, రైల్వే అండర్ పాస్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా బస్టాండ్ వైపు వెళతాయి. బాన్సువాడ, డిచ్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ప్రస్తుత రూట్‌లోనే నడువనున్నాయి. లారీలు, భారీ వాహనాలు బైపాస్ నుంచి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
భారీ విగ్రహాల రూట్లు ..
నగరం నుంచి భారీ విగ్రహాల నిమజ్జనం కోసం బాసర వద్ద, ఉమ్మెడలోని గోదావరి వద్ద ఏర్పాట్లు చేశారు. ఉమ్మెడలో ఆరు క్రేన్లు, బాసరలో నాలుగు క్రేన్ల ద్వారా వినాయక విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. కాగా, 8 ఫీట్ల లోపు గణపతి విగ్రహాలను నగరంలోని నెహ్రూపా ర్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు తరలించాలి. అనంతరం ఖాళీ వాహనాలు బాసర, ధర్మాబాద్, కందకుర్తి, సాటాపూర్, రెంజల్, నవీపేట మీదుగా రావాల్సి ఉంటుంది.
ఎనిమిది ఫీట్ల కంటే ఎత్తుగా ఉన్న విగ్రహాలను నగరం నుంచి నందిపేట మండలం ఉమ్మెడకు తీసుకెళ్లాలి. పూలాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, దుబ్బా, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, డీఎస్ చౌరస్తా, ముబారక్‌నగర్, మాణిక్‌బండార్, దాస్‌నగర్, మాక్లూర్, మాదాపూర్, నందిపేట్ మీదుగా ఉమ్మెడ సరిహద్దులోని గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలి. ఇదే రూట్‌లో నందిపేట, నవీపేట్ మీదుగా బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్లొచ్చు.
నగరంలో శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి
8 ఫీట్ల విగ్రహాలు బాసరకు..
8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు ఉమ్మెడ గోదావరికి
1300 మంది పోలీసులతో బందోబస్తు

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..