
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● భూ భారతిపై అధికారులతో
వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష
నిజామాబాద్ అర్బన్: భూభారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి గురువారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పురోగతిని తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీవోటీలకు సంబంధించిన అప్లికేషన్‌లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటవెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. కాగా, హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, పశు సంపద కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హులకు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు. కాగా, గ్రామ పాలన అధికారులుగా ఎంపికై న వారు నియామక పత్రాల కోసం ప్రత్యేక బస్సులలో సకాలంలో హైదరాబాద్ చేరుకునేలా చూడాలన్నారు. బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.