
అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్య
మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ గ్రామానికి చెందిన బెల్లెడిగి చిన్ను (44) స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం తెలిసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్ను, పోతన్న భార్యాభర్తలు. చిన్ను కంఠేశ్వర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తోంది. పోతన్న చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఇల్లు చిన్నది కావడంతో న్యాల్‌కల్ రోడ్‌లోని లలితానగర్‌లో అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం అర్ధరాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం చిన్ను ఇంట్లో కనిపించకపోయే సరికి భర్త పలుచోట్ల వెతికాడు. పశువుల కాపరులు చెరువులో మృతదేహాన్ని గుర్తించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
డ్రంకన్ డ్రైవ్‌లో
నలుగురికి జైలు
ఖలీల్‌వాడి: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 13 మందిలో నలుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందిని ట్రాఫిక్ పీఎస్‌లో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఆధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ 9 మందికి రూ. 13 వేల జరిమానా విధించగా, నలుగురికి ఒక రోజు, రెండు, మూడు రోజుల జైలు శిక్షను విధించినట్లు సీఐ తెలిపారు.
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
నవీపేట: గణేశ్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని సూచించారు.