
నేడు కామారెడ్డికి సీఎం రాక
● వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భారీ వర్షాలతో కామారె డ్డి జిల్లా అతలాకుతలమైంది. వరద ఇళ్లను చుట్టేసింది. పంటలను ముంచేసింది. రోడ్లను ధ్వంసం చే సింది. వాగుల ప్రవాహ ఉధృతికి వంతెనలు కొట్టు కుపోయాయి. మునుపెన్నడూ చూడని వరదలతో జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. నష్టాన్ని పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జిల్లాకు వస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని జిల్లావాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సీఎం పర్యటన ఇలా...
సీఎం రేవంత్ హెలీకాప్టర్‌లో 11.30 గంటలకు తాడ్వాయి మండలం ఎర్రాపహడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లింగంపేట మండలం లింగంపల్లి కుర్దుకు చేరుకొని దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించిన వంతెనను పరిశీలిస్తారు. బూరుగిద్ద శివారులో వరదలతో దెబ్బతి న్న పంటలను పరిశీలించి రోడ్డు మార్గాన 1.10 గంటల వరకు కామారెడ్డి పట్టణ శివారులోని జీఆర్ కా లనీని సందర్శించి, బాధితులతో మాట్లాడతారు. 2 గంటలకు కలెక్టరేట్ భవనానికి చేరుకొని ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. కలెక్టరేట్‌లో మధ్యాహ్న భోజనం ముగించిన అనంతరం సమావేశ మందిరంలో 2.20 గంటల నుంచి 3 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీఎం రాక సంద ర్భంగా బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర లింగంపేట మండలంలో పర్యటించారు.