
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
● క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● ఎరువుల గోదాం, పల్లె దవాఖానా తనిఖీ
జక్రాన్‌పల్లి/డిచ్‌పల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌లో అర్గుల్ సొసైటీ ఎరువుల గోదామును, డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో పల్లె దవాఖానను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సొసైటీలో గోదాములో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించిన కలెక్టర్.. ఈ సీజన్‌లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాక్ మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని జక్రాన్‌పల్లి మండల వ్యవసాయ అధికారిణి దేవికకు సూచించారు. పడకల్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని నడిపల్లి పల్లెదవాఖాన సిబ్బందికి సూచించారు. ఆయన వెంట జక్రాన్‌పల్లి తహసీల్దార్ కిరణ్మయి, ఏవో దేవిక, జీపీ కార్యదర్శి భాస్కర్, సొసైటీ సీఈవో తిరుపతిరెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ వినీత్, ఏఎన్‌ఎంలు సుజాత, రజిత తదితరులు ఉన్నారు.