
ధర్పల్లిలో కత్తెర పోట్ల కలకలం..
● ఒకరి మృతి, నలుగురికి గాయాలు
ధర్పల్లి: మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్పల్లి గ్రామానికి చెందిన కోటగిరి దాసు అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడికి భార్య గంగామణి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాసుకు తన భార్యతో మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అతని భార్య గంగామణి ధర్పల్లిలోనే నివాసం ఉంటోంది. దాసు అదే గ్రామంలో ఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. తన భార్య విడిపోవడానికి అదే గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కారణమని ఆగ్రహించిన దాసు మంగళవారం ఉదయం లక్ష్మి ఇంటికెళ్లి కత్తెరతో ఆమె పై దాడి చేశాడు. అడ్డుగా వచ్చిన ఆమె కుమార్తె గౌతమి, అదే కాలనీకి చెందిన శెట్‌పల్లి నాగరాజు, అతని భార్య శోభ, మరో వ్యక్తి శెట్టిపల్లి భోజేశ్వర్ పై దాసు కత్తెరతో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలైన లక్ష్మిని స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడ్డ మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కళ్యాణి పరిశీలించి వివరాలను సేకరించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ధర్పల్లిలో కత్తెర పోట్ల కలకలం..