
నోటిఫికేషనే ఆలస్యం!
● గ్రామాల్లో రాజకీయ హడావుడి
● స్థానిక ఎన్నికలపై జోరుగా చర్చ
● రిజర్వేషన్లపై నాయకులు,
కార్యకర్తల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నెలలోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అన్నట్లుగా మారింది పల్లెల్లో వాతావరణం. ఎక్కడ చూసినా రాజకీయ హడావుడి నెలకొంది. రిజర్వేషన్లు ఏ విధంగా వస్తాయోనని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదు రు చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 31 జెడ్పీటీసీలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 545 ఉండగా, 5,022 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ఓటర్లు మొత్తం 8,51,417 మంది ఉండగా, పురుష ఓటర్లు 3,96,778 మంది, మహిళా ఓటర్లు 4,54,621, ఇతరులు 18 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 5,053 ఉన్నాయి.
ఫస్ట్.. పరిషత్
ముందుగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యా లెట్ పత్రం, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లేనప్పటికీ ప్రత్యామ్నాయ మార్గంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల కోటాపై పరిమితి ఎత్తేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది.
10న తుది జాబితా
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల 6వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. 8వ తేదీన జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. 9వ తేదీన వినతులు, అభ్యంతరాలు పరిష్కరించిన తరువాత 10న తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎప్పుడైనా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చని తెలుస్తోంది.