
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భార్య మృతి తట్టుకోలేక..
ఇందల్వాయి: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవెల్లికి చెందిన నీరడి గంగాధర్, హేమలతకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో హేమలత గత శనివారం వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక గంగాధర్(34) గన్నారం గ్రామంలో తన చిన్నమ్మ వాళ్ల ఇంట్లో సోమవారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. మృతుడి తల్లి ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
భూమి రిజిస్ట్రేషన్
చేయించలేదని..
ఖలీల్‌వాడి: తనకు రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరో టౌన్ పోలీసులు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అర్సపల్లికి చెందిన సాయిలు(38) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. సాయిలు అక్క భర్తతో కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకొని తల్లి వద్దే ఉంటోంది. కాగా సాయిలుకు చెందిన భూమిని అక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో భూమిని రిజిస్ట్రేషన్ చేయించడానికి కొంత నగదును డిపాజిట్‌గా సాయిలు తన అక్కకు చెల్లించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అయినా అక్క భూమి రిజిస్టేషన్ చేయడానికి మెలికవేయడంతో సోమవారం సాయంత్రం సాయిలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మద్యానికి బానిసై యువకుడు..
బీబీపేట: మద్యానికి బానిసైన ఒకరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఎల్లమైన సాయి(27)కి చిన్ననాడే తల్లితండ్రులు చనిపోయారు. అతని పెద్దమ్మనే సాయి, తమ్ముడు నవీన్‌ను చేరదీసింది. కొంత కాలంగా సాయి పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. శనివారం సాయంత్రం తన జన్మదిన వేడుకలను స్నేహితుల మధ్య జరుపుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. స్థానిక చెరువు కట్టపై నిలబడి తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపాడు. వెంటనే కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి గాలింపు చేపట్టగా ఆచూకీ లభించలేదు. అధికారులు ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఆదివారం, సోమవారం బోట్ ద్వారా చెరువులో గాలించారు. సాయంత్రం సాయి మృతదేహం లభ్యమైంది. మృతుడి తమ్ముడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య