
శోభాయాత్ర రూట్‌లను సిద్ధం చేయాలి
భారీ గణపతుల నిమజ్జనానికి రూట్ ఇదే..
ఆర్మూర్‌టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే రహదారులను సిద్ధం చేయాలని సీపీ సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ప్రధాన రూట్, రహదారి మరమ్మతు పనులు, గూండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్‌లను సందర్శించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శోభాయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ ను కఠినంగా అమలు చేయాలని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది శ్రీ చందు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఖలీల్‌వాడి: నిజామాబాద్ నగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా సీపీ సాయిచైతన్య పలు సూచనలు చేశారు. హైటెన్షన్ రైల్వే లైన్ నేపథ్యంలో భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వెళ్లాల్సిన రూట్‌లను ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 ఫీట్లలోపు విగ్రహాలను నెహ్రూపార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలి. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ఫూలాంగ్– ఎన్టీఆర్ చౌరస్తా– రైల్వే స్టేషన్– బస్టాండ్– రైల్వే ఓవర్ బ్రిడ్జి–శివాజీ చౌక్– దుబ్బా– జీజీ కాలేజీ చౌరస్తా–బైపాస్ రోడ్డు– డీఎస్ చౌరస్తా– ముబారక్ నగర్– మాణిక్ బండార్– దాస్‌నగర్– మాక్లూర్–నందిపేట్ మండలంలోని ఉమ్మెడ గ్రామంలోని గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలని తెలిపారు. ఇదే రూట్‌లో నందిపేట నుంచి నవీపేట్ మీదుగా బాసర గోదావరి బ్రిడ్జికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. పోలీసులకు సహకరిస్తూ శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.