
పెన్షన్ విధానాల రద్దుకు జంగ్ సైరన్
● నేడు నూతన పెన్షన్ విద్రోహదినం
● ధర్నాకు తరలనున్న 5వేల మంది
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఉద్యోగ, ఉపాధ్యాయులకు సరైన ఆర్థిక భద్రత ఇవ్వని సీపీఎస్, యూపీఎస్ పథకాలను రద్దు చేయాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రభుత్వానికి భారం కాని, నయా పైసా ఖర్చు లేని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 15,600 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్, యూపీఎస్ విధానంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘమైన పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 5వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ మహాధర్నాలో పాల్గొనే అవకాశాలున్నాయి. సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – గజ్జె శ్రీనివాస్,
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు