
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే హత్య
● సిర్‌పూర్‌లో మిస్సింగ్ కేసును
ఛేదించిన పోలీసులు
మద్నూర్(జుక్కల్): తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భర్తను ప్రియుడితోకలిసి భార్య హతమార్చిన ఘటన డోంగ్లీ మండలం సిర్‌పూర్‌లో చోటుచేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ రవి, ఎస్సై విజయ్‌కొండ వివరాలు వెల్లడించారు. డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్ గ్రామానికి చెందిన మాగిరి రాములు(35)కు భార్య మాదాబాయి, ముగ్గురు కొడుకులు ఉన్నారు. అతడు చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అగస్టు 23 నుంచి రాములు కనబడకుండపోవడంతో అతడి అక్క లక్ష్మీబాయి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 30న మంజీర నదిలో రాములు మృతదేహం లభ్యమైంది. అదేరోజు సిర్‌పూర్ గ్రామానికి చెందిన ఉష్కల్‌వార్ శంకర్, రాములు భార్య మాదాబాయి ఇద్దరు కలిసి బైక్‌పై మద్నూర్ వైపు వస్తుండగా వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు వారిని విచారించారు. దీంతో రాములును వారే హత్య చేసినట్లు తెలిపారు. మాదాబాయికి శంకర్‌తో వివాహేతర సంబంధం ఉండగా, భర్త అడ్డును తొలగించుకోవాలనుకుంది. ఈక్రమంలో ఆగస్టు 22న రాములుకు శంకర్ ఫుల్లుగా మద్యం తాగించి, సాలూరలోని మంజీర బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రాములను అతడు కత్తితో పొడిచి, బ్రిడ్జి పైనుంచి మంజీర నదిలో పడేశాడన్నారు. శంకర్, మాదాబాయి ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.