దోమకొండ: మండలంలోని సంఘమేశ్వర్ గ్రామ శివారులో బుధవారం ఎడ్లకట్ట వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన గ్రామానికి చెందిన గోత్రాల బాల్‌రాజ్(41) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురువారం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు గాలించగా, శుక్రవారం ఉదయం పొలాల మధ్య మృతదేహంను గుర్తించారు. మృతుడు బాల్‌రాజ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం దోమకొండకు వచ్చి తిరిగి సొంత గ్రామం సంఘమేశ్వర్ వెళుతుండగా, వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.రెండు రోజులుగా గాలించగా శుక్రవారం మృతదేహం లభించింది.మృతుడికి భార్య రూప, ఇద్దరు కుమారులు ఉ న్నారు.తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బోధన్‌రూరల్: సాలూర గ్రామ శివారులోని మంజీర నది బ్రిడ్జి వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. స్థానిక జీపీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి గ్రామ పంచాయితీ సిబ్బందితో అక్కడే పాతిపెట్టినట్లు ఎస్సై వివరించారు.
జలాల్పూర్‌లో ఒకరి ఆత్మహత్య
వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ (47) కుటుంబంలో గొడవలు జరగడంతో అతడి భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన గౌస్ గురువారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
కంజర్‌లో యువతి...
మోపాల్: మండలంలోని కంజర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జినిగెల అక్షయ (20) జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. గ్రామంలోని ఓ అద్దె ఇంట్లో అమ్మమ్మ లక్ష్మీ, చెల్లి నవ్యతో కలిసి జీవనం సాగిస్తోంది. మృతురాలి తల్లి గతంలోనే మృతిచెందగా, తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. శుక్రవారం సాయంత్రం అక్షయ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు.