
పెద్దవాగు ఉగ్రరూపం
మోర్తాడ్(బాల్కొండ)/బాల్కొండ: కామారెడ్డి, ని జామాబాద్ జిల్లాల్లో విస్తరించిన పెద్దవాగు ఉగ్ర రూపం దాల్చింది. కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు నీటి ప్రవాహం 6.4 మీటర్ల ఎత్తులో సాగింది. 1989లో తొలిసారి పెద్దవాగు 5.2 మీటర్ల ఎత్తులో ప్రవహించగా మధ్య కాలంలో 5 మీటర్లకు తక్కువ లోతులోనే నీటి ప్రవాహం సాగింది. బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్, మోర్తాడ్, ముప్కాల్, మెండోరా మండలాల మీదుగా ప్రవహించే పెద్దవాగు పరిసరాల్లో పంటలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ నుంచి వరద నీటిని గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేయడం, పెద్దవాగు ప్రవాహం తోడుకావడంతో తడపాకల్ వద్ద నది ఉధృతి మరింత ఎక్కువ అయ్యింది. పెద్దవాగు నీటి ప్రవాహంను సెంట్రల్ వాటర్ కమిషన్ ఉద్యోగులు లెక్కించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ముప్కాల్ మండలం వెంచిర్యాల్, మెండోరా మండలం వెల్కటూర్ గ్రామాల్లోనే సుమారు 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
● తొలిసారి 6.4 మీటర్ల ఎత్తులో
ప్రవహించిన వరద
● 1989లో 5.2 మీటర్ల
ఎత్తులో ప్రవాహం