
హంగర్గను చుట్టుముట్టిన ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్
బోధన్‌రూరల్: బోధన్ మండలంలోని హంగర్గ గ్రామాన్ని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ చుట్టుముట్టింది. గురువారం సాయంత్రం మంజీర నదిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడం, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ వెనక్కి నెట్టడంతో గ్రామంలోకి వరద నీరు చేరుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ విఠల్ గ్రామంలోనే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు బాధితులను గుర్తించి వారి బంధువుల ఇళ్లకు తరలించారు. పాడి పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖండ్‌గావ్ గ్రామ శివారులోని మంజీర బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిలిపివేసినట్లు తహసీల్దార్ తెలిపారు.