
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
● నుడా చైర్మన్ కేశ వేణు
నిజామాబాద్ సిటీ: వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోందని నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించడం శుభపరిణామమన్నారు. మండపాల నిర్వాహకులు వారి వివరాలు అందించి ఉచిత విద్యుత్ పొందాలన్నారు. మండపాల వద్ద డీజేలను నిషేధించిన నేపథ్యంలో పోలీసు శాఖకు సహకరించాలన్నారు.
మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ
జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ తెలిపారు. జిల్లాలోని పేద ముస్లిం విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు సయ్యద్ ఖైజర్ మాట్లాడుతూ క్రీడలు, ఇతర రంగాల నుంచి ప్రముఖ శిక్షకులు వచ్చి ఇందూరు యువకులకు శిక్షణలో తర్ఫీదునివ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్‌గౌడ్, రత్నాకర్, రామర్తి గోపి, సుభాష్ జాదవ్, మల్యాల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.