
ఎస్సారెస్పీ నీటి విడుదల నిలిపివేత
● 29,907 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు సోమవారం మధ్యాహ్నం నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి భారీ వరదలు రావడంతో గత సోమవారం నుంచి 25 వేల క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. గరిష్టంగా 3.75 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్‌లోకి ఆదివారం రాత్రి ఇన్‌ఫ్లో తగ్గడంతో గోదావరిలోకి నీటి విడుదలను క్రమంగా తగ్గించారు. చివరికి 2 గేట్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. సోమవారం మధ్యాహ్ననికి పూర్తిగా గేట్లు మూసివేశారు.
కొనసాగుతున్న వరద నీరు
ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 29,907 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం 37వేల క్యూసెక్కులకు తగ్గిన వరద, మధ్యాహ్నానికి 29,907 క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 4500 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3500, సరస్వతి కాలువకు 500, లక్ష్మి కాలువకు 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. 651 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ 1090.90(80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఏటికి ఎదురీదుతున్న మత్స్యకారులు
ఎస్సారెస్పీ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల తగ్గుముఖం పట్టడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తున్నారు. చేపల కోసం మత్స్యకారులు నీటితో సహవాసం చేస్తున్నారు. ప్రాజెక్ట్ వరద గేట్ల ముందర తెప్పలపై వెళుతూ, బండరాళ్లపై నిలబడి చేపలు పడుతున్నారు. మరోవైపు గోదావరిలోకి నీటి విడుదల చేసే సమయంలో చేపలు, చేప పిల్లలు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వరద గేట్లకు జాలీ గేట్లు ఉంటే చేప పిల్లలు గంగపాలయ్యేవి కావని అభిప్రాయపడుతున్నారు. కాగా, వరద గేట్లకు జాలి గేట్లు పెట్టే పరిస్థితి ఉండదని ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు.

ఎస్సారెస్పీ నీటి విడుదల నిలిపివేత