
ఎస్సారెస్పీకి తగ్గిన వరద
బాల్కొండ: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి 65 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు తగ్గించారు. గోదావరిలోకి 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల నీరు పోతుంది. వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 3500, ఎస్కెప్ గేట్ల ద్వారా 4500, సరస్వతి కాలువ ద్వారా 500, లక్ష్మి కాలువ ద్వారా 150, ఆవిరి రూపంలో 651, మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1090.90(80.05టీఎంసీలు) అడుగుల నీటి నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
మరింత పెరిగిన విద్యుదుత్పత్తి
ప్రాజెక్ట్ వద్ద ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. నాలుగు టర్బయిన్‌ల ద్వారా 36.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కేప్ గేట్ల ద్వారా, కాకతీయ కాలువ ద్వారా కలిపి 8 వేల క్యూసెక్కుల నీట విడుదల కొనసాగుతోంది. ఆదివారం మరింత పెరిగి 36.50 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 9.84మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్‌కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు.