
తొండాకూర్ శ్రీమంతులు
● ఆపద ఎవరికొచ్చినా ముందుంటున్నారు ● 2019లో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఏర్పాటు ● పక్క గ్రామాల వారికీ ఆర్థికసాయం
ఊరు చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి..
అంటూ శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ను నిజ జీవితంలో ఆచరిస్తున్నారు డొంకేశ్వర్ మండలంలోని తొండాకూర్ గ్రామస్తులు. ఆపదలో ఎవరున్నా ఊరంతా ఒక్కటై అండగా నిలుస్తున్నారు. ఊరు విడిచి ఎక్కడెక్కడో ఉంటున్న వారు సైతం ‘ఎక్కడి నుంచి వచ్చామో మరిచిపోకూడదు’ అంటూ గ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. తొండాకూర్ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సేవలపై ‘సాక్షి’ సండే స్పెషల్..
డొంకేశ్వర్(ఆర్మూర్): పక్కోడు బాగుపడితే ఓర్వలేని ఈ కాలంలో.. గ్రామంలో ఏ ఒక్కరికీ ఆపద వచ్చినా అండగా నిలుస్తున్నారు. మండలంలోని తొండాకూర్ గ్రామస్తులు. కొంతమంది వ్యక్తులు ఫౌండేషన్‌గా ఏర్పడి ఊరిలో ఏ పేదకు కష్టమొచ్చినా ఆదుకుంటున్నారు. అనుకోని ఆపద వస్తే మేమున్నామంటూ వెంటనే ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితానికి భరోసా ఇస్తున్నారు. ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేని వారికి రూ.లక్షల్లో సాయమందించి ప్రాణాలను సైతం నిలుపుతున్నారు. కులమతాలకు అతీతంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. 15 మందితో 2015లో ఏర్పాటైన గ్రూపు 2019 సెప్టెంబర్‌లో ఫౌండేషన్‌గా మారింది. ప్రస్తుతం 224మంది సభ్యులు ఉండగా, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, విదేశాలకు వెళ్లిన వారున్నారు. ప్రారంభంలో నెలకు రూ.100 చొప్పున నిధులు జమ చేయగా, ఇప్పుడు ఆపద సమయాల్లో అడిగిన వెంటనే ఆలోచించకుండా రూ.వేలల్లో ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. గ్రామానికి చెందిన వారికే కాకుండా పక్క గ్రామాల పేదలకూ సాయం చేస్తూ ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తోంది. మున్ముందు పేద విద్యార్థుల చదువులకు కూడా తోడ్పాటునందించాలని సభ్యులు భావిస్తున్నారు.
● గ్రామానికి చెందిన బొగ్గుల సాగర్ 2023లో దుబాయ్‌లో మరణించగా, ఆయన మృతదేహాన్ని ఇంటికి రప్పించేందుకు తెచ్చేందుకు కృషి చేయడంతోపాటు బాధిత కుటుంబానికి రూ.1.75 లక్షల సాయం.
● 2024 డిసెంబర్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ బండి రాజన్న భార్య లావణ్య అనారోగ్యంతో మరణించగా, బాధిత కుటుంబానికి రూ.1.44 లక్షల ఆర్థిక సాయం.
● 2025 ఫిబ్రవరిలో బోదాసు నడ్పి గంగాధర్ భార్య పోసాని అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ పోషణ కోసం గంగాదర్‌కు రూ.13,300 అందజేశారు.
● 2025 మార్చిలో ఐదో తరగతి చదువుతున్న దండుగుల శ్యామ్ ఇంట్లో పాముకాటుతో మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయి దుఖంలో ఉన్న తల్లి సునీతకు రూ.26,300 అందజేశారు.
● గంగాసముందర్ గ్రామానికి చెందిన మోతె అశోక్ తొండాకూర్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పని చేస్తున్నాడు. ఆయన కొడుకు అనారోగ్యం బారిన పడడంతో వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి అశోక్‌కు రూ.2లక్షల వరకు అందించారు.
● తొండాకూర్ గ్రామానికి చెందిన అవుట్ల నరేశ్ 2025 జూలైలో ట్రాక్టర్‌తో పొలాన్ని దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడి మరణించాడు. పెద్ద దిక్కును కోల్పోయిన నరేశ్ కుటుంబానికి రూ.1.29 లక్షలు అందజేశారు.
● కుల, మతాల బేధాలు లేవని చాటి చెప్పేందుకు గ్రామానికి చెందిన షేక్ కలీం పాషా దుబాయ్ నుంచి రూ.30వేలు, రూ.10వేలు వేర్వేరు సందర్భాల్లో ఫౌండేషన్‌కు అందజేశారు.
ఫౌండేషన్ అందించిన సేవల్లో కొన్ని

తొండాకూర్ శ్రీమంతులు

తొండాకూర్ శ్రీమంతులు

తొండాకూర్ శ్రీమంతులు

తొండాకూర్ శ్రీమంతులు