
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, మిగతా రైతులకు 40 శాతం సబ్సిడీపై యంత్రాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు 6,742 యూనిట్లు మంజూరు కాగా మొత్తం పదకొండు రకాల పరికరాలకు ఈ పథకం వర్తించనుంది. ఇందుకుగాను రూ.5.20కోట్లు కేటాయించగా మొదటి విడతగా రూ.1.67కోట్లు జిల్లాకు వచ్చాయి. అయితే ట్రాక్టర్లు, డ్రోన్లకు అవకాశం కల్పించకపోవడం రైతులను కొంత నిరాశపరిచింది. వ్యవసాయ పరికరాల కోసం రైతులు స్థానిక ఏఈవోలను లేదా మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సంప్రదించాలని డీఏవో గోవింద్ తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి రైతు పట్టాదార్ పుస్తకం, ఆధార్ కార్డు అందజేయాలని సూచించారు. అలాగే భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించి దానికి సంబంధించిన పత్రాన్ని దగ్గర ఉంచుకోవాలని పేర్కొన్నారు.
కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
వ్యవసాయ పరికరాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో లబ్ధిదారుల ఎంపిక అధికారులతో కూడిన కమిటీలు ఫైనల్ చేయనున్నాయి. రూ.లక్ష లోపు పరికరాలకు మండల స్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. అలాగే రూ.లక్షకు పైబడిన యంత్రాలుంటే జిల్లా స్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, ఆగ్రోస్ ఆర్‌ఎం, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎల్‌డీఎం సభ్యులుగా ఉంటారు.
నియోజకవర్గాల వారీగా మంజూరైన యూనిట్లు, నిధులు
నియోజకవర్గం యూనిట్లు నిధులు(లక్షల్లో)
నిజామాబాద్‌రూరల్ 1,461 103.28
ఆర్మూర్ 1,077 92.05
భీమ్‌గల్ 1,684 122.35
బోధన్ 1,149 91.25
బాన్సువాడ 1,242 89.60
నిజామాబాద్‌అర్బన్ 98 14.50
యాంత్రీకరణ పథకాన్ని
మళ్లీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
జిల్లాకు 6,742 యూనిట్లు,
రూ.5.20 కోట్ల నిధులు కేటాయింపు
రైతులు దరఖాస్తులు చేసుకోవాలని కోరిన వ్యవసాయ శాఖ
పరికరాలు యూనిట్లు
పవర్ స్ప్రేయర్లు 715
పిచికారీ యంత్రాలు 5,098
రోటవేటర్లు 274
సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్స్ 64
డిస్క్‌హారో రోటవేటర్స్ 347
బండ్ ఫార్మర్ 15
పవర్ వీడర్స్ 33
బ్రష్ కట్టర్స్ 58
పవర్ టిల్లర్స్ 41
మేజ్ షెల్లర్స్ 20
స్ట్రా బాలర్స్ 77