బోధన్: జిల్లాలో 11వేల మెట్రిక్ టన్నుల ఎరువుల స్టాక్ ఉండగానే మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుండడంతో ఎక్కడా కొరత ఏర్పడలేదని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని పల్లె దవాఖాన, సొసైటీ ఎరువుల గోదామును తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో సిబ్బంది హజరు, అవుట్ పేషంట్‌ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయడం లేదని తెలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి డీపీవోకు ఫోన్ చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫాగింగ్ చేపట్టేలా చూడాలని ఆదేశించారు. సహకార సొసైటీ గోదాములో స్టాక్‌ను తనిఖీ చేసిన కలెక్టర్.. సరిపడా ఎరువులు అందుతున్నాయా? అని అక్కడికి వచ్చిన రైతులను ప్రశ్నించారు. ఒకే సారి కాకుండా అవసరానికి అనుగుణంగా ఎరువులు తీసుకెళ్లాలని రైతులకు సూచించారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.30కోట్ల రుణాలు
ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణానికి ఆర్థికస్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో లబ్ధిదారులకు రూ.30కోట్లకు పైగా రుణాలు అందించామని కలెక్టర్ వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుండగా, ఉచితంగా ఇసుకను సమకూరుస్తున్నామన్నారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోతే వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని జాబితాలో నుంచి వారి పేర్లను తొలగించి వారి స్థానంలో అర్హులకు ఇల్లు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీస్‌ల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా ఆఫీస్‌ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎక్కడా కొరత లేదు
ఇందిరమ్మ ఇళ్లకు ఎస్‌హెచ్‌జీ
ద్వారా రుణం
నిర్మాణం పూర్తయిన ‘డబుల్’ ఇళ్లను అర్హులకు కేటాయించాలి
అధికారులకు కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాలు