
సీఎంసీ మెడికల్ కాలేజ్ పేరిట మోసం!
● పలువురి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన నిందితుడు!
● ఆలస్యంగా వెలుగులోకి ఘటన
నిజామాబాద్‌నాగారం/డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి శివారులో గల సీఎంసీ (క్రిస్టియన్ మెడికల్ కాలేజ్) పేరిట ఓ వ్యక్తి నగరంలోని పలు వురి వద్ద రూ.కోట్లలో డబ్బులను వసూలు చేశాడు. కానీ వైద్యశాలకు అనుమతి రాకపోవడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో నిందితుడిని నిలదీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కర్ణాటకకు చెందిన షణ్ముఖ మహాలింగం అనే వ్యక్తి సీఎంసీని ఇటీవలే పునఃప్రారంభించారు. ఈక్రమంలో అతడు ఓ ఐఎంఏ నేతకు డైరెక్టర్ పదవి ఇస్తానని చెప్పి రూ. 3కోట్ల వరకు నొక్కేసినట్లు సమాచారం. దీంతోపాటు వైద్యులను ఫ్యాకల్టీగా పెట్టుకుంటానని చెప్పడంతో జిల్లాలో ఉన్న పలువురు వైద్యుల వద్ద షణ్ముక లింగం చెప్పినట్లు అతడు డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్లు సమాచారం. అలాగే కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించడంతో పాటు మూడు నెలలుగా కొంతమంది డా క్టర్లు, స్టాప్ నర్సులు, ఇతర ఉద్యోగులను,శానిటేషన్, సెక్యూర్టీగార్డ్స్ తదితర సిబ్బందిని నియమించుకున్నారు. నియామకాల్లో కూడా ఒక్కోక్కరి వద్ద రూ. 50వేల నుంచి రూ. 1లక్ష వరకు వసూలు చేసిన్నట్లు సమాచారం. కానీ జీతాలు ఇవ్వకపోవండతో సీఎంసీ చైర్మన్ అని చెప్పుకునే షణ్ముకమహాలింగంను కొన్ని రోజుల క్రితం సిబ్బంది నిలదీయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి షణ్ముకను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
అనుమతి ఇవ్వని ఎన్‌ఎంసీ..
సీఎంసీని పున:ప్రారంభించడంతో నెల కిందటే ఎన్‌ఎంసీ బృందం ఢిల్లీ నుంచి వచ్చి పరిశీలించింది. నిబంధనలు పాటించలేదని అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. సీఎంసీ కాలేజ్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా వైద్యారోగ్యశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో నిర్వాహకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మూడు నెలల ప్రాథమిక అనుమతి ఇచ్చారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని శాఖలో ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
చీటింగ్ కేసు నమోదు చేశాం..
సీఎంసీ కాలేజీకి సంబంధించి డాక్టర్ అజ్జ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ మహాలింగంపై చీటింగ్ కేసు నమోదు చేశాం. విచారణ చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
–మహమ్మద్ షరీఫ్, డిచ్‌పల్లి ఎస్సై