
క్రైం కార్నర్
చెరువులో పడి ఒకరి మృతి
సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామంలోని ఊర చెరువులో పడి ఒకరు మృతిచెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జాగర్ల నరహరి(43) అనే వ్యక్తి ఈ నెల 3న స్నానం చేయడానికి ఊర చెరువులోకి వెళ్లాడు. కానీ ఈత రాకపోవడంతో అతడు నీట మునిగి, మృతిచెందాడు. మృతుడి భార్య లహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు...
మాక్లూర్: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన అరుణ్(28) కుటుంబ గొడవల కారణంగా ఈనెల 3న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో అరుణ్ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
చోరీ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష
బాల్కొండ: మండల కేంద్రంలోని ఓ వైన్స్ దుకాణంలో చోరీకి పాల్పడిని వ్యక్తికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. బాల్కొండలోని తుల్జా భవాని వైన్స్ షాపులో 2024 సెప్టెంబర్ 4న నిర్మల్ మండలం కొండపూర్ గ్రామానికి చెందిన నక్క పోశెట్టి చోరీకి పాల్పడ్డాడు. షట్టర్ తాళం పగలగొట్టి రూ. 14వేల నగదుతోపాటు కొన్ని మందు బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై అప్పటి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని, ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సరళరాణి సాక్ష్యాధారాలను పరిశీలించి, మంగళవారం అతడికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.
అట్రాసిటీ కేసులో ఒకరికి..
నిజామాబాద్ లీగల్: కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో ఒకరి కి నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. నగరంలోని మిర్చి కాంపౌండ్ చెందిన దుర్గయ్యను, తన కొడుకును క్రాంతి కుమార్ అనే వ్యక్తి 24 డిసెంబర్ 2020న కులం పేరుతో దూషించి దాడి చేశాడు. బాధితులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.