
జాప్యానికి కారణమేమిటి?
నిజామాబాద్ అర్బన్ : భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నా అర్జీల సత్వర పరిష్కారానికి ఎందుకు చొరవచూపడం లేదని పలు తహసీల్దార్ల తీరుపై కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమవుతున్న మండలాల తహసీల్దార్లను జాప్యానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లతో భూభారతిపై మంగళవారం సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల వివరాలు మండలాల వారీగా తెలుసుకున్న కలెక్టర్.. ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యిందా? తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆర్డీవోలు ప్రతిరోజూ ఒక మండలాన్ని తప్పనిసరిగా సందర్శించి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను పర్యవేక్షించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. నిర్ణీత గడువు లోగా అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని, ఆమోదించిన దరఖాస్తులను 24 గంటలలోగా ఆర్డీవోల ఆమోదం కోసం పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులను సైతం వెంటనే పరిష్కరించాలన్నారు. సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలుగా నోటీసులు రూపొందించుకుని అన్ని విధాలుగా సమాయత్తం కావాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్‌పల్లి నుంచి వీసీలో పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి
ఎందుకు చొరవ తీసుకోవడం
లేదని తహసీల్దార్లకు ప్రశ్న
ఆమోదించిన దరఖాస్తులను
24గంటల్లో ఆర్డీవోలకు పంపించండి
వీడియోకాన్ఫరెన్స్‌లో
కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి