
స్థానికంలో మనదే గెలుపు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/లింగంపేట : ‘‘కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది. పాలిచ్చే బర్రెను వదిలేసి తన్నే దున్నపోతును తెచ్చుకున్నమని ప్రజలు బాధపడుతుండ్రు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళితే ‘స్థానిక’ ఎన్నికల్లో మనదే విజయం’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లింగంపేట అంబేడ్కర్ చౌక్‌లో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన సభలో ఆ యన మాట్లాడారు. అంబేడ్కర్ జయంతి రోజున స్థానిక దళిత నాయకుడు సాయిలును ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అవమానించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి అభివృద్ధి ప్రదాతగా చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే అమెరికా నుంచి ఏమైనా నిధలు తీసుకువచ్చిండా అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గా లు మోసపోయాయని, అందరూ కసితో ఉన్నారని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా తప్పించుకున్న సర్కారు.. ఇప్పుడు సన్న వడ్లకూ ఇవ్వడం లేదని విమర్శించారు.
తమ ప్రభుత్వ హయాంలో కరోనాలాంటి సమ యంలో కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని పేర్కొన్నారు. పాలించడం చేతగాక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 22 లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు ఇస్తానని చెప్పి వాళ్లను కూడా మోసం చేశారన్నారు. కేసీఆర్ 1,022 గురుకులాలు ఏర్పాటు చేసి, 6.50 లక్షల మంది విద్యార్థులకు సన్నబువ్వ పెట్టి, నాణ్యమైన చదువు చెప్పిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రాణా లు బలితీసుకుంటోందని ఆరోపించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, బాజిరెడ్డి, జనార్దన్‌గౌడ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులున్నారు.
అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సక్సెస్