
జనమహోత్సవం
వనమహోత్సవం.. కావాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వనమహోత్సవాన్ని జనమహోత్సవంగా చేసేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చేయీ చేయీ క లిపి ఉద్యమంలాగా ముందుకు సాగాలి. ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికా రులు జిల్లాలో 28.87 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, 2016 నుంచి 2024 వరకు జిల్లాలో 4,32,93,430 మొక్కలు నాటగా 3,27,38,541 మొక్కలు బతికాయి. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావడంతో పాటు నాటిన మొక్కల సంరక్షణ విషయంలోనూ నిబద్ధతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
అంకుఠిత దీక్షతో మొక్కలు
నాటుతున్న రావుట్ల జనార్దన్..
సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన రావుట్ల జనార్దన్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉంటూ 2009 డిసెంబర్ 23 నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ గ్రీన్ వారియర్‌గా పేరుపొందారు. సుభాష్ పాలేకర్, ఖమ్మంకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత వనజీవి రామయ్య స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జనార్దన్ చేపడుతున్నారు. జీవనాధారం కోసం తాను పెళ్లిపత్రికల ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. పరిమిత సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్నారు. మొక్కలు నాటేందుకు గాను తనకున్న రెండు ప్లాట్లను సైతం అమ్ముకున్నారు. సిరివెన్నెల గ్రీన్ సొసైటీ స్థాపించి మొక్కలు నాటుతున్నారు జనార్దన్. ఇప్పటివరకు జిల్లాలో 2.5 లక్షల మొక్కలు నాటారు. మరోవైపు విద్యార్థులు, వివిధ సంస్థల ద్వారా మరో 12.5 లక్షల మొక్కలు నాటించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చెందిన పట్లోళ్ల రాంరెడ్డి స్థాపించిన గ్రామభారతి సంస్థకు జిల్లా బాధ్యుడిగా జనార్దన్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ద్వారా జిల్లాలో 250 మంది రైతులు తమకున్న సాగుభూమిలో కొద్దిమేర సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక అడవుల్లో పండ్ల చెట్లు ఉండాలనే లక్ష్యంతో జనార్దన్ ప్రతి సంవత్సరం అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) చల్లుతున్నారు. అదేవిధంగా మొక్కల రవాణా కో సం జనార్దన్ సొంతంగా ట్రాలీ ఆటో ఏర్పాటు చేసుకున్నారు.
ఎండాకాలంలో అడవి జంతువులకు, కోతులకు ఆహార ఉత్పత్తులను అందించే అరటి, కొబ్బరి మొక్కలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. చెట్ల వద్ద ఎండిన గింజలను, విత్తనాలను నిత్యం సేకరిస్తున్నారు. ఫంక్షన్లలో కొబ్బరి మొక్కలను బహుమతిగా ఇస్తున్నారు. నిత్యం ఆకుపచ్చ చొక్కాతోనే కనిపించే జనార్దన్ అదే రంగు బైక్, హెల్మెట్, మాస్క్, పెన్ను, సెల్‌ఫోన్ పౌచ్ వాడుతున్నారు. దుకాణంలో, ఇంట్లో కుర్చీలు, బల్లలు సైతం ఆకుపచ్చ రంగులోనే ఉండేలా చూసుకుంటున్నారు. మనిషి కారణంగానే భవిష్యత్ తరాల మనుషులకు, ఇతర జీవరాశులకు ముప్పు ఏర్పడుతోందని చెబుతున్న జనార్దన్ 2015లో ‘చెట్లుంటే పురోగతి–లేకుంటే అధోగతి’ అనే పుస్తకం రాశారు. ప్రతి ఏటా అప్‌డేట్ చేస్తూ ఈ పుస్తకంలో అదనపు వివరాలు జోడించి ముద్రణ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉచితంగా 12 వేల పుస్తకాలు పంచిపెట్టారు. జనార్దన్‌ను అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, హైకోర్టు న్యాయమూర్తులు శ్రీసుధ, జీవీ సుబ్రహ్మణ్యం సన్మానించారు.
జిల్లాలో హరితహారం (వనమహోత్సవం)లో నాటిన మొక్కల వివరాలు
పచ్చదనం పెంపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములైతేనే మేలు
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా
28.87 లక్షల మొక్కలు
నాటేందుకు అధికారుల ప్రణాళిక
2016–17 నుంచి జిల్లాలో
నాటిన మొక్కలు 4,32,93,430..
బతికినవి 3,27,38,541
జిల్లాలో 2.5 లక్షల మొక్కలు నాటిన గ్రీన్ వారియర్ రావుట్ల జనార్దన్

జనమహోత్సవం

జనమహోత్సవం

జనమహోత్సవం