
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
ఖలీల్‌వాడి: పోలీసులకు విధులు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ పోతరాజు సా యిచైతన్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మెగా వైద్య శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందితోపాటు వారి కు టుంబసభ్యుల ఆరోగ్యంపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితులలో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్య సూచనలు పాటించాలన్నారు. వైద్య శిబిరంలో ఆర్‌బీఎస్, కంటి పరీక్ష, ఈసీజీ, 2డీ ఈకో, క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ తదితర పరీక్షలు చేస్తారన్నారు. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా డాక్టర్లను సంప్రదించాలన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోని సిబ్బంది, హోంగార్డులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డీసీపీలు బస్వారెడ్డి, రామ్‌చందర్ రావు, ఏసీపీ రాజావెంకట్ రెడ్డి, పీ శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీశ్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, డాక్టర్లు సుధాకర్ రావు, చంద్రమోహన్, వంశీ, ఆఫ్రిన్, నిఖిత, షాహబాజ్ హైమద్ పాల్గొన్నారు.
సీపీ సాయి చైతన్య
మెగా వైద్య శిబిరం ప్రారంభం