
సబ్‌కలెక్టర్ కార్యాలయ జప్తునకు ఆదేశం
వర్ని: వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని బోధన్ సీనియర్ సివిల్ జడ్జి కాంచనరెడ్డి సోమవారం తీ ర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమ్మడి వర్ని మండలంలోని లక్ష్మీసాగర్ ప్రాజెక్టులో 155 ఎకరాల భూములు కోల్పోయిన 105 మంది రైతులకు రూ.62 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. 1986లో లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కారేగాం, మేడిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల పరిధిలోని 105 మంది రైతులకు చెందిన 155 ఎకరాల వ్యవసాయ ముంపునకు గురైంది. సదరు రైతులు కోర్టును ఆశ్రయించగా రూ.56 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని 2022లో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పు ఇప్పటి వరకు అమలు కాలేదు. రైతులు తిరిగి స్థానిక సివిల్ కోర్టుకు వెళ్లగా రూ.56 లక్షలకు వడ్డీ కలుపుకుని మొత్తం రూ.62 లక్షల పరిహారాన్ని రైతులకు చెల్లించాలని.. లేనిపక్షంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తులను జప్టు చేయాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
ఫైల్ పెండింగ్‌లో ఉంది
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్‌ను నాలుగు నెలల క్రితం జిల్లా కలెక్టర్‌కు పంపించాం. ఇరిగేషన్ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల కాగానే రైతులకు చెల్లిస్తాం.
– వికాస్ మహతో, సబ్ కలెక్టర్, బోధన్