
శుభకార్యాలు చేసుకునేదెలా?
నవీపేట: ప్రజలకు తక్కువ ధరలో ఫంక్షన్‌హాల్ సౌకర్యం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలలో టీటీడీ కల్యాణ మండపాలను నిర్మించింది. కానీ మండపాల నిర్వహణను ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అధ్వానంగా మారాయి. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతోపాటు మండపాల పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో ఎవరూ కూడా టీటీడీ కల్యాణ మండపాల్లో శుభకార్యాలు నిర్వహించడం లేదు.
ఇదీ పరిస్థితి..
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో రెండు కల్యాణ మండపాలు, నవీపేట, ఆర్మూర్, బాల్కొండ, ధర్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున కొన్నేళ్ల క్రితం నిర్మించారు. వీడీసీల ప్రోత్సాహంతో నిరుపేదలకు ఆసరాగా నిలవాలని అన్ని ఏర్పాట్లతో నిర్మించారు. కానీ నిర్మించిన కల్యాణ మండపాలపై పాలకవర్గం చిన్నచూపు చూస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన మండపాలకు మరమ్మతులు కరువవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నవీపేట, బాల్కొండలలోని మండపాల చుట్టూ ఉన్న ప్రహరీలు కూలాయి. ఆర్మూర్, ధర్పల్లిలలో తాగునీటి సమస్య ఉంది. ఆర్మూర్‌లో పలుమార్లు బోరుబావుల తవ్వకం జరిపిన ఫలించలేదు. తరచూ సమస్యలు రావడంతో జిల్లా కేంద్రంలోని రెండు మండపాలను ప్రయివేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. నవీపేటలోని మండపంలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ఆవరణలో ఇటీవల కురిసిన వర్షపు నీరు నిలిచి చెరువులను తలపింపజేస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలతో ప్రయివేట్ వ్యక్తులు ఫంక్షన్‌హాల్‌లను నిర్మించడంతో టీటీడీ కల్యాణ మండపాల వినియోగం తగ్గింది. తక్కువ ధరే అయినా సౌకర్యాల లేమి కారణంగా ఔత్సాహికులకు నిరాశ కలిగిస్తుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి టీటీడీ కల్యాణ మండపాలను ఆధునికీరించడంతోపాటు తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
అధ్వానంగా టీటీడీ
కల్యాణ మండపాలు
కనీస వసతులు కరువు
పట్టించుకోని అధికారులు
ప్రతిపాదనలు సిద్ధం చేశాం..
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీటీడీ కల్యాణ మండపాల బాగోగులపై ఇటీవల సమావేశం జరిగింది. మండపాల్లోని సమస్యలను గుర్తించి ప్రతిపాదనలు పంపించమని ఆదేశించారు. డివిజన్‌లోని మండపాలలో నెలకొన్న సమస్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. తాగునీటి సౌకర్యం, ప్రహరీల నిర్మాణం, భవనాల పగుళ్లకు మరమ్మతులు చేపడుతాం.
–రాజేష్, నిజామాబాద్ డివిజన్ టీటీడీ కల్యాణ మండపాల ఇన్‌చార్జి

శుభకార్యాలు చేసుకునేదెలా?

శుభకార్యాలు చేసుకునేదెలా?