
రైతుకు బోనస్
సర్కారుకు బాసట..
సుభాష్‌నగర్ : రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్న సర్కారుకు జిల్లా రైతాంగం బాసటగా నిలిచింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యంలో 88 శాతం సన్నరకాలుండటమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మిగతా జిల్లాల రైతులు దొడ్డు రకాలు సాగు చేయగా, నిజామాబాద్ జిల్లాలో మాత్రం సన్నరకాల వైపు మొగ్గు చూపారు. కాగా, సన్నరకాలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.500 బోనస్ అందించనుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18.47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకాలు సేకరించగా, అందులో మన జిల్లాలో 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 603 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,01,561 మంది రైతుల నుంచి 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, అందులో 7,25,499 మెట్రిక్ టన్నుల సన్నరకాలు, 91,488 మెట్రిక్ టన్నుల దొడ్డురకాలున్నాయి. ఇప్పటి వరకు 94,757 మంది రైతుల ఖాతాల్లో రూ.1,713 కోట్ల ధాన్యం డబ్బులు జమయ్యాయి.
సింహభాగం మన జిల్లాదే..
రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్నరకాల్లో సింహభాగం నిజామాబాద్ జిల్లాదే. మొత్తం 18.47 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, మన జిల్లాలోనే 7,25,499 మెట్రిక్ టన్నులు సేకరించారు. తర్వాతి స్థానంలో కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఇతర జిల్లాలు ఉన్నాయి. యాసంగి సీజన్‌లో మన జిల్లా 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, సన్నరకాల సేకరణలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలవడం విశేషం.
3.80 లక్షల ఎకరాల్లో సన్నరకాలు..
సన్నరకాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ధాన్యం సేకరణలో రాష్ట్రంలో
నిజామాబాద్ జిల్లా ప్రథమం
కొనుగోళ్లలో 88 శాతం సన్నరకాలే
ప్రభుత్వానికి మద్దతుగా అన్నదాత
సన్నరకాలు సాగు చేశా..
నాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది వరకు దొడ్డు రకాలే సాగు చేసేవాడిని. ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడంతో ఈసారి పదెకరాల్లో సన్నరకాలే సాగు చేశాను. దిగుబడి బాగా వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాను. ప్రభుత్వ ప్రోత్సాహం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – కౌలాస్ మోహన్,
మాజీ సర్పంచ్, తిర్మన్‌పల్లి
సన్నరకాలే అధికంగా సేకరించాం..
యాసంగి సీజన్‌లో సన్నరకాలే సేకరించాం. 7,25,499 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచాం. మొత్తం సేకరించిన ధాన్యంలో కూడా జిల్లా టాప్‌లో నిలవడం గర్వకారణంగా ఉంది.
– శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్నబియ్యం సరఫరా చేస్తోంది. సన్నబియ్యం సరఫరా చేయాలంటే సన్నరకాలు పండించాలని రైతులు గ్రహించి ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. క్వింటాలుకు రూ.500 బోనస్ కలిసి వస్తోందని భావించిన రైతాంగం యాసంగి సీజన్‌లోనూ అత్యధికంగా సన్నరకాలు సాగు చేసింది. సాధారణంగా యాసంగిలో స్వల్పకాలిక రకాలైన దొడ్డు రకాలను సాగు చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సీజన్‌లో రైతులు 3.80 లక్షల ఎకరాల్లో సన్నరకాలను సాగుచేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ కోసం రైతులు ఎదురుచూస్తుండడం గమనార్హం.

రైతుకు బోనస్

రైతుకు బోనస్