
బియ్యం నిల్వలను వేగంగా తరలించాలి
నిజామాబాద్ రూరల్ : జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మిల్లుల వద్ద ఉన్న బియ్యం, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిసిపోకుండా యుద్ధప్రాతిపదికన గోడౌన్లకు తరలించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న మార్కెట్ కమిటీ గిడ్డంగులతోపాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్‌కు చెందిన గిడ్డంగులను గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గోడౌన్లలో బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు. ఎన్ని రైస్‌మిల్లుల నుంచి ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిగిన బియ్యం నిల్వలు గోడౌన్లకు చేరాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది, వాటి నాణ్యత పరిశీలన, లాటింగ్ ప్రక్రియల నిర్వహణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లలో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా సరిపడా సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని, లారీల కొరత లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. బియ్యం, ధాన్యం బస్తాల తరలింపు సమయంలో వర్షాలతో తడిసిపోకుండా టార్పాలిన్లు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. కాగా, గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వలను అన్‌లోడింగ్ చేయించడంలో కాంట్రాక్టర్ అలసత్వ వైఖరిని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టరుపై నిబంధనలకు అనుగుణంగా చర్యలకు సిఫార్సు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ సెక్రెటరీ అపర్ణ, గోడౌన్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
ధాన్యం బస్తాలు తడవకుండా చూడాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
గిడ్డంగులను సందర్శించిన
రాజీవ్‌గాంధీ హనుమంతు