
నగరంలో అధునాతన స్విమ్మింగ్‌పూల్
నిజామాబాద్ నాగారం: నగరంలో అధునాతన హంగులతో ప్రభుత్వ స్విమ్మింగ్‌పూల్ నిర్మాణం కాబోతోంది. ఈ మేరకు రూ.15కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మల్టీ పర్పస్ హాల్‌తోపాటు, చేంజింగ్ రూమ్స్, ఓపెన్ జిమ్ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. గంగస్థాన్ ఫేజ్–1 ప్రాంతంలోని సర్వే నంబర్ 106లో ప్రభుత్వ భూమి సుమారు వంద ఎకరాలు ఉండగా, స్విమ్మింగ్ పూల్‌తోపాటు ఇతర నిర్మాణాల కోసం 7 ఎకరాల 30గుంటల భూమి అవసరం ఉంటుందని అంచనా వేశారు.
కబ్జా నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి..
గంగస్థాన్ ఫేజ్–1 ప్రాంతంలో సర్వేనంబర్ 106లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒలింపిక్ అసోసియేషన్ భవనం, స్టేడియం నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. అప్పటి మంత్రి సుదర్శన్‌రెడ్డి భూమి పూజ సైతం చేశారు. ఒలింపిక్ భవన నిర్మాణానికి ఽనిధులు కేటాయించడంతో పనులను ప్రారంభించారు. పిల్లర్స్, బేస్‌మెంట్ వరకు సుమా రు రూ.15లక్షల వరకు ఖర్చు చేశారు. అటు తర్వా త ఒలింపిక్ సంఘంలో విబేధాలు రావడంతోపా టు రాజకీయ మార్పుల నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. మరోవైపు భూమి కబ్జా అవుతుండడంతో ఒలింపిక్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులు అడ్డుకునేందుకు చాలా శ్రమించారు. ప్రత్యేకంగా సర్వే అధికారులతో సర్వే చేయించి హద్దు రాళ్లు పెట్టారు. అయినప్పటికీ కబ్జాదారులు దొంగ పట్టాలు, పేపర్లు సృిష్టించి నానా హంగామా చేశారు. ప్రజా సంఘాలు, ఒలింపిక్ సంఘం, క్రీడాకారులు, అధికార యంత్రాంగం కృషితో భూమి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది.
రూ.15కోట్లతో పనులు చేపట్టేందుకు
ప్రతిపాదనలు
గంగస్థాన్‌లోని సర్వే నంబర్ 106లో ప్రభుత్వ స్థలం కేటాయింపు
ప్రతిపాదనలు పంపించాం
ముందుగా స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని కాపాడేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు చుట్టూ ఫెన్సింగ్ వేశాం. స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, చేంజింగ్ రూమ్స్, తదితర నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
– ముత్తెన్న, జిల్లా యువజన క్రీడల అధికారి
సుమారు రూ.10 లక్షలతో ఫెన్సింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒలింపిక్ సంఘం, జిల్లా యంత్రాంగం కలిసి బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డికి స్టేడియానికి కేటాయించిన భూమి అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని విన్నవించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మళ్లీ స్టేడియం కేటాయించిన స్థలాన్ని సర్వే చేయించారు. కలెక్టర్ నిధులు ఇవ్వడంతో సుమారు రూ.10లక్షలతో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 7 ఎకరాల 30గుంటల భూమికి రక్షణ కల్పించారు.

నగరంలో అధునాతన స్విమ్మింగ్‌పూల్