
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మాక్లూర్: ఇంటి స్థలం(ప్లాట్) రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టిముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో ఆయన స్వగ్రామం ఆలూర్ మండలం రాంచంద్రాపల్లిలోని సొంతింట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఐదేళ్లుగా గంగామోహన్ గొట్టిముక్కల పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయన పంచాయతీ కార్యదర్శుల సంఘానికి మండల అధ్యక్షుడు కూడా. గొట్టిముక్కల గ్రామానికి చెందిన ముప్పడి రాజేందర్ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ విషయమై పంచాయతీ కార్యదర్శి గంగామోహన్‌ను సంప్రదించగా రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్య రూ.18 వేలకు ఒప్పందం కుదిరింది. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తానని గంగామోహన్ కరాఖండిగా చెప్పడంతో బాధితుడు రాజేందర్ గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం ముందుగానే గ్రామానికి చేరుకొని బాధితుడికి తగు సూచనలు ఇచ్చి పంపించారు. పకడ్బందీగా వ్యవహరించి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గంగామోహన్‌కు బాధితుడు రాజేందర్ లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గంగామోహన్‌పై గతంలో కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్ వెల్లడించారు. నిందితుడిని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.
ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.18 వేలు
లంచం తీసుకుంటూ దొరికిన వైనం
రాంచంద్రాపల్లిలోని సొంతింట్లో సోదాలు