
ఎనిమిది కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టాపల్లి గ్రామానికి చెందిన 8 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు అకారణంగా సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధిత కుటుంబాలు పేర్కొన్నాయి. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను వేర్వేరుగా కలిసి బాధితులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. అనంతరం డిచ్‌పల్లి మండల కేంద్రంలో విలేకరులతో బాధితులు మాట్లాడుతూ.. గత ఏడాది సెప్టెంబర్ 15న గణేశ్ నిమజ్జనం సందర్భంగా తంగెళ్ల కిషన్, మాసిపెద్ది శ్రీనివాస్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుందన్నారు. తర్వాత మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు మిట్టాపల్లి గ్రామానికి చెందిన కంచెట్టి గంగాధర్ అండతో వీడీసీ సభ్యులు మున్నూరు కాపు కులానికి చెందిన ఎనిమిది కుటుంబాలను (తేలు గణేష్, తాజామాజీ సర్పంచ్), ఒడ్డం నర్సయ్య (మాజీ ఎంపీటీసీ భర్త), మాసిపెద్ది శ్రీనివాస్, తేలు గంగాధర్, మాసిపెద్ది రవి, గోపు రాజేశ్వర్, చిత్తపేట నడిపి గంగారం, గోపు చరణ్) సాంఘిక బహిష్కరణ చేసినట్లు తెలిపారు. తమ కుటుంబాల్లో జరిగే శుభ, అశుభ కార్యాలకు గ్రామంలోని ఇతర కులాల వారు హాజరు కావద్దని, ఎలాంటి సహకారం అందించవద్దని వీడీసీ సభ్యులు తీర్మానం చేసి ఈ మేరకు అన్ని కులాల వారికి హుకుం జారీ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాల వారికి మాదిగలు డప్పు కొట్టడం లేదని, చాకలి వారు బట్టలు ఉతకడం లేదని, మంగళి వారు వెంట్రుకలు తీయడం లేదని, కుమ్మరి వారు కుండలు ఇవ్వడం లేదన్నారు. దీంతో గత పది నెలలుగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డిచ్‌పల్లి సీఐ మల్లేశ్, ఎస్సై ఎండీ షరీఫ్‌లకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో తాము విధిలేక కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.
బాధితుల్లో తాజా మాజీ సర్పంచ్,
మాజీ ఎంపీటీసీ భర్త