
నాటుడెందుకు.. నరుకుడెందుకు..!
డిచ్‌పల్లి: హరితహారం పేరిట ప్రతి ఏడాది వివిధ విభాగాల ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరిట ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఇతర ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతారు. మొక్కలు పెరిగి చెట్లుగా మారిన తర్వాత అవి విద్యుత్ తీగలకు తగులుతున్నాయని చెబుతూ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రతి ఏటా వేసవి కాలంలో చెట్లను నరికివేస్తున్నారు. తీగలకు తగులుతున్న కొమ్మలను నరికివేయకుండా చెట్ల కాండం వరకు నరికి వేస్తున్నారు. దీంతో అవి తిరిగి పెరగడానికి చాలా సమయం పడుతోంది. డిచ్‌పల్లి–నిజామాబాద్ ప్రధాన రహదారిపై, డిచ్‌పల్లి మండల కేంద్రంతో పాటు నడిపల్లి, బర్ధిపూర్, ధర్మారం(బి) గ్రామాల శివారులో విద్యుత్ తీగల కింద ఉన్నాయనే పేరిట విద్యుత్ శాఖ సిబ్బంది వందలాది మొక్కలను నరికివేస్తున్నారు. దీనిపై అటవీశాఖ సిబ్బంది ఎంపీడీవోతో పాటు సంబంధిత జీపీల్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలు మొక్కలు నాటే సమయంలోనే విద్యుత్ తీగల కింద కాకుండా కొంచెం అవతలి వైపు నాటితే బాగుంటుందని, కానీ లెక్కల్లో మొక్కలు చూపాలనే ఆత్రంతో ఇష్టారీతిన నాటుతున్నారని విద్యుత్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడి ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా మొక్కలు నాటే సమయంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
హరితహారంలో నాటిన మొక్కలు
విద్యుత్ తీగలకు తగులుతున్నాయని నరికేస్తున్న వైనం