
గర్విస్తున్న తల్లి
యుద్ధంలో కొడుకు..
దేశ సరిహద్దుల్లో అడవిమామిడిపల్లి యువకులు
● ప్రస్తుతం యుద్ధక్షేత్రంలో గ్రామానికి చెందిన
ఎనిమిది మంది జవాన్లు
● గత 24 ఏళ్లలో 22 మంది ఆర్మీలోకి..
● ఆపరేషన్ సిందూర్
నేపథ్యంలో సైనికుల
తల్లుల మనోభావాలు
● నేడు వరల్డ్ మదర్స్ డే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జిల్లాలోని అడవిమామిడిపల్లి గ్రామం గురించి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఈ గ్రామం నుంచి ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో 8 మంది జవాన్లు వి ధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవసాయ కుటుంబాల నుంచే దేశసేవ కోసం యువకులు వెళుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పనిచేస్తున్న ఈ యువకులను చూసి తాము గర్వపడుతున్నామని ఈ జవాన్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. దేశరక్షణలో తమ గ్రామం నుంచి సైనికులు ఉండడం గర్వకారణమంటున్నారు. తమ గ్రామానికే కాకుండా జిల్లాకు సైతం యువకులు పేరు తెస్తున్నారంటున్నారు. అడవిమామిడిపల్లి గ్రామం నుంచి గత 24 ఏళ్ల కాలంలో 22 మంది యువకులు ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) దళాల్లోకి వెళ్లారు. మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఈ ఊరి ప్రత్యేకతను చాటుతున్నారు. దీంతో ఈ గ్రామాన్ని ‘జైహింద్ మామిడిపల్లి’ అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఊరిలోకి అడుగుపెట్టగానే స్వామి వి వేకానంద విగ్రహం కనిపిస్తుంది. అనంతరం ఊరి మధ్యలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం, తరువాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు దర్శనమిస్తాయి. దేశభక్తి స్ఫూర్తిగా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తమ గ్రామ యువకుల ప్రాణాలను పణంగా పెట్టి దేశరక్షణ విధులకు పంపించడం పట్ల వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలని గ్రామస్తులు చెబుతున్నా రు. జై జవాన్.. జై కిసాన్ స్ఫూర్తిని చాటుతున్న ఈ గ్రామం జిల్లాలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. అవసరమైతే తాము సైతం యుద్ధరంగంలోకి దిగుతామని ఈ గ్రామానికి చెందిన రిటైర్ అయిన సైనికులు చెబుతున్నారు. రిటైరయ్యాక తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రభుత్వం పిలిస్తే తక్షణమే సరిహద్దులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ సైనికులు చెబుతుండడం మరింత స్ఫూర్తిని రగిలిస్తోంది.

గర్విస్తున్న తల్లి