
ప్రారంభమైన పచ్చళ్ల సీజన్
● మామిడికాయలు, ఇతర దినుసుల కొనుగోళ్లలో ప్రజలు బిజీ●
● ఏడాదికి సరిపడా తయారీకి ఏర్పాట్లు
బాన్సువాడ : వేసవి కాలంలో ఏ గ్రామంలో చూసిన మామిడి కాయల సుగంధం, పచ్చడి తయారీ, వడియాల సన్నాహాలతో సందడి నెలకొంటుంది. ఆహార పదార్థాలు మాత్రమే కాదు సంప్రదాయం, కుటుంబ బంధాలు, గ్రామీణ సంస్కృతి సజీవ చిహ్నాలు. పచ్చళ్లు ఆహార సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రుచిని పెంచడమే కాక ఆహారాన్ని సంరక్షించే సంప్రదాయ పద్ధతిగా కూడా పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం కలగక మానదు.
బెల్లం ఆవకాయ, మెంతి ఆవకాయ, పులిహోర ఆవకాయ వంటి రకాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, పాత తరం నుంచి కొత్త తరానికి జ్ఞానాన్ని అందించడం వంటివి సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తాయి.
పచ్చడి తయారీ విధానం..
● గట్టిగా, పుల్లగా ఉన్న పచ్చి మామిడి కాయలను ఎంచుకుని లోపల టెంకలు తీసి ముక్కలుగా కోయాలి.
● ఆవపిండి, ఎండుమిరపకాయల కారం, ఉప్పు, మెంతిపొడి, నువ్వుల నూనె వంటి ప్రధాన పదార్థాలు కలిపేందుకు సిద్ధం చేసుకోవాలి. కొన్ని రకాల్లో బెల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు.
● ఆ తరువాత జాడీలో కారం మిశ్రమాన్ని మామిడి ముక్కలతో పొరలు, పొరలుగా అమర్చి, పైన నూనె పోస్తారు. ఇది పచ్చడిని పాడవకుండా సంరక్షిస్తుంది.
● 34 రోజులపాటు గాలిచొరబడకుండా మూత పెట్టి ఉంచిన తర్వాత తినడానికి తయారవుతుంది. కొన్ని రకాలు ఎండబెట్టి దీర్ఘకాల నిల్వకు సిద్ధం చేస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
మామిడి పచ్చడిలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. పచ్చి మామిడిలో పొటాషియం, ఇతర ఖనిజాల వల్ల వేసవిలో డీహైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవడం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.
బంధాలను బలపరుస్తుంది
ప్రతి సంవత్సరం వేసవిలో మామిడి పచ్చడి చేయడం ఒక పండుగలా ఉంటుంది. కుటుంబ సభ్యులందరం కలిసి తయారీలో పాల్గొంటాం.ఏడాది పొడవునా రుచిని ఇస్తుంది. అలాగే మా కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది.
–పుష్పలత, శేట్లూరు గ్రామం

ప్రారంభమైన పచ్చళ్ల సీజన్